Saturday, 26 April 2008

వివాహ సప్తపది

౧. సీసము

బ్రతుకు సైకిలునకు పరిపూర్ణతను గూర్చు

ఫ్రెష్షు క్యారేజి మ్యారేజి గాదె,

ఠీవి పొంగెడు రెండు జీవ నదుల గల్పు

గ్రేటు బ్యారేజి మ్యారేజి గాదె,

ఫెమినిజమ్మున కొక వింత ఫేమును తీర్చు

స్టేజి ప్రిస్టేజి మ్యారేజి గాదె,

క్లాతు సిల్వరు గోల్డు లగ్జరీ షాప్సు కు

ప్లెజరెంకరేజి మ్యారేజి గాదె,

జీవితంబను రేడియో సెట్టు నకును

ఈజినెస్ ఫైను ట్యూను మ్యారేజి గాదె,

స్వీటు ఘాటుల(జ) సరదాల బ్యూటి రుచుల

క్లోజు తాజాల కిళ్ళి మ్యారేజి గాదె

౨. ఉత్పలమాల

ఇమ్ముగకెంపులీనుచు మహీజకరాంజలివెల్గి, రాముశీ

ర్షమ్మున మల్లెపూవులయి లాస్యములాడ్, తదీయ దివ్య దే

హమ్మున మేలినీలమణులౌచును పెండిలి శోభ చాటు ము

త్యమ్ముల సేనబ్రాలు శుభదమ్ములుగా ఎసలారి మిమ్ముని

త్యమ్మును ప్రోచుతన్ బహువిధమ్ముల "గౌతము" "అన్నపూర్ణ" నున్

౩.శార్దూలం

అమ్మానాన్నలు పేర్ల రూపమున ప్రత్యక్షమ్ము లైరంచు బల్

సమ్మోదమ్మును పొందినారమిదె! మా స్వాంతంబునన్ సత్యమౌ

నిమ్మాటల్ - వధు "వన్నపూర్ణ" యనగానే మాదు అబ్బాయి "గౌ

తమ్మున్" పేరుకు ముందు ఉన్నది ఎడందన్ తోచ "గంగధరమ్"

౪. ఉత్పలమాల

భువిని అధర్మ వర్తనను ముప్పది ఆరయి, ధర్మవర్తనన్

అవితథ రీతి నొక్కటయి అర్వదిమూడయి, భావనానజీ

వవనిని మీర లిర్వురు నవమ్మయి, నిత్యములెక్కలోని వా

రివలె వెలుంగుడయ్యా ! వెలుంగుడమ్మా! సఫలీకృతభవ్యసదాశయోన్నతిన్

౫.

"గరికిపాటి" వారి "అరవింద" కాంతి - సా

గరికపాటి; - కాదు - గరికపాటి;

సీ.ఎ. - ఇంజనీరు జీవిక మార్చుత;

ఏ.సి గాగ పుణ్యరాశి గాగ

౬.

ఉల్లమలర జేయు పల్లవి చరణాల

కృష్ణ శాస్త్రి పాట రీతి ప్రీతి

"గౌతమారవింద" నూతన దంపతుల్

అభ్యుదయపు గాన మందు కొనుత!

౭.

"రామడుగు" కులాఖ్య రమ్యమైన వనాన

మాధవుని కృపైక సౌధ మహిమ

"గౌతమారవింద" కమనీయమారంద

పరిమళాలు వెల్లివిరియుగాక !

శుభం భూయాత్!

విజయవాడ,

౨౪ - ౦౨ - ౨౦౦౮

- డా రామడుగు వెంకటేశ్వర శర్మ

No comments:

Blog Archive