ఆశీర్వాద పంచరత్నాలు
శుభాశీస్సులు
1)
పేరు పొందురీతి, పేరు నిలుచురీతి,
పేరు సార్ధకముగ పెరుగుమయ్య!
పేరు కేవిధిన్ రిపేరు లేకుండ ప్రి
పేరు గనుమ! మంచి తీరు మనుమ !
2)
"గౌతమా""రవింద" కళల జాబిల్లి! "రా
మడుగు" అల్లి బిల్లి మల్లి బుల్లి !
పాలుగ్రోలు నీదు పసి నోరు మురిపాల
సిరుల పసిడి విరుల కురియుగాక !
3)
వెండిగిన్నె వోలె వెలయంగ బాల్యంబు
పాలు పెరుగు పాయసాలు గ్రోలి
కృష్ణ సుమతి శతక గీతివై "ప్రియతమా!"
అందచందములకు కందమగుమ !
4)
చేతవెన్న ముద్ద, చెంగల్వ పూదండ
గాగ శైశవంబుగడుచు చుండ
అల్ల తెలుగు వెలుగువై ఆయురారోగ్య
బుద్ధి విద్య లెల్ల పొందుమయ్య!
5)
ఎల్లవేలుపులను ఎలమితో నీ పేరు
నందు నిలిచిప్రోవనలరు నీదు
బారసాల(బాలసారె) వేళ పట్టెద నా శిష
కవన హారతులకు క్రమగతుల !
ఆశీస్సులతో మీ తాతగారు,
డా|| రామడుగు వెంకటేశ్వర శర్మ,
౨/౧౭ బ్రాడిపేట, గుంటూరు -౨.
No comments:
Post a Comment